హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: ‘బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు డబ్బులున్నయి కానీ, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు డబ్బుల్లేవా? ఇప్పటికైనా ఆర్థికశాఖ తన వైఖరిని మార్చుకోకుంటే తిరుగుబాటు తప్పదు. విద్యార్థుల ఫీజు పోరును ఉధృతం చేస్తాం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేములు రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం సంక్షేమ భవన్ ముట్టడి చేపట్టారు.
భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఈ సందర్భంగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ధర్నాకు సంఘీభావంగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వెంటనే ఫీజు బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలంగా విద్యార్థుల సాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లించడమే లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 16.75 లక్షల మంది విద్యార్థులకు రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. 10 నెలలుగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు.
ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని, కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని తెలిపారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలతో విద్యార్థులు మరణిస్తున్నా, అనారోగ్యాలతో అవస్థలు పడుతున్నా, సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోతున్నాయని తెలిపారు. ఫీజు, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, నందగోపాల్, ప్రీ తం, సుధాకర్, చంద్రశేఖర్, రాజేందర్, లిం గయ్య, రాఘవేందర్, మణికంఠ, నర్సింహగౌడ్, ఉమేశ్, రాకేశ్, అరవింద్ పాల్గొన్నారు.