న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కాడి పడేసిందా? బీసీ రిజర్వేషన్లకు బీహార్‌లో అనుకున్నంత స్పందన రాలేదా? అందుకే అక్కడ బీసీ నినాదం వదిలేసి ఓటు చోరీని అందుకున్నదా? బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాన్ని సాగదీయాలని సూచించిందా? ఢిల్లీ ఆదేశాల మేరకే రాష్ట్రంలో రిజర్వేషన్ల డ్రామా నడుస్తున్నదా? బీహార్ ఎన్నికలు ముగిసిన తరువాత బీసీ రిజర్వేషన్లను అటకెక్కించడమేనా? అంటే ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాలను గమనిస్తే.. అవును అనే సమాధానమే వస్తున్నది. బీసీలకు ప్రభుత్వపరంగా 42% రిజర్వేషన్లు ముగిసిన ఎపిసోడ్ అని, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ తెలంగాణలో రిజర్వేషన్ల డ్రామాను సాగదీసి, తరువాత అటకెక్కిస్తారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి ఎన్నికల ప్రచారంలో కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అంచనా వేసినంత స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదని, అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బీసీ సబ్జెక్టునే వదిలేసి, ఓటు చోరీని ఎత్తుకున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఓటు చోరీ ప్రచారాస్ర్తానికి అటు ప్రజల నుంచి, అటు అధికార పక్షం నుంచి స్పందన కనిపిస్తుండటంతో బీసీ నినాదం పక్కనపెట్టాలని నిర్ణయించినట్టు ఆ వర్గాలు చెప్తున్నాయి.
ఆగస్టులో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాకు ఐఏసీసీ నుంచి రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు హాజరుకాకపోవడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధర్నా చేసిన సమయంలో పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ ఎంపీలు కానీ, ఇండియా కూటమి ఎంపీలు కానీ తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని మాటవరసకు కూడా పార్లమెంటులో ప్రస్తావించకపోవడానికి కారణం ఇదేనని పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో ఈ సబ్జెక్టును రాష్ట్ర నేతల ఇష్టానికి వదిలేసినట్టు ఢిల్లీ నేతలు చెప్తున్నారు. ఈనేపథ్యంలో పార్టీపరమైన రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ మంత్రివర్గం ఆలోచన చేసినట్టు తెలిసింది. అయితే పార్టీపరమైన రిజర్వేషన్లతో వెళ్తే.. ప్రతిపక్ష బీజేపీకి ఆయుధం చేతికి ఇచ్చినట్టు అవుతుందని ఏఐసీసీ హెచ్చరించినట్టు తెలిసింది. బీసీలకు ప్రభుత్వపరమైన రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని బీజేపీ ప్రచారం చేసుకుంటుందని, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నదని, అందుకోసం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ స్థానిక సంస్థల ఎన్నికలను, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాగదీయాలని సూచించినట్టు తెలిసింది.
ఢిల్లీ నేతల సూచనల మేరకే ప్రత్యేక జీవోతో 50% రిజర్వేషన్ల సీలింగ్ క్యాప్‌ను సడలిస్తూ తెలంగాణలో ఉత్తర్వుల అంశాన్ని తెర మీదకు తెచ్చారని, ఎలాగూ న్యాయ సమీక్ష ముందు నిలబడవు కాబట్టి ఎన్నికలు వాయిదా పడతాయని, ఈలోగా బీహార్ ఎన్నికలు పూర్తవుతాయని ఏఐసీసీ ప్రతినిధులు సూచించినట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఉన్నందున ఎన్నికలకు వెళ్తే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, సమస్య పరిష్కారమయ్యేవరకు ఎన్నికలు వాయిదా వేసుకోవడమే మంచిదని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత పార్టీపరంగా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని, అంతవరకూ డ్రామా నడిపించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది.