Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ‘మేము చేసిందే సర్వే.. చెప్పిందే లెక్క’ అన్నట్టుగా ఉన్నది కులగణనపై కాంగ్రెస్ సర్కారు తీరు! ప్రజలు చెప్పింది నిజమా? కాదా? అని పరిశీలించేందుకు ఎలాంటి ప్రామాణికత పాటించకపోవడమే కాకుండా ఇతర డాటాతోనూ పోల్చిచూడలేదు. అరకొరగా ఇష్టారాజ్యంగా సేకరించిన వివరాలనే క్రోడీకరించి ‘లెక్క తేల్చినం’ అని ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటున్నది. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వివరాలనే నివేదించి చేతులు దులుపుకొన్నది. కులగణన సర్వే డాటాకు ప్రామాణికత ఏమిటని సామాజికవేత్తలు, మేధావులు, బీసీ కుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
కచ్చితమైన లెక్కలు తీయాలంటే తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న గణాంకాలు, కుటుంబాల సమాచారాన్ని మరోసారి క్షేత్రస్థాయిలో సరిచూసుకుంటూ వాస్తవమేనా? కాదా? అని నిర్ధారించుకుంటూ, కొత్త కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తూ సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. కానీ కాంగ్రెస్ సర్కారు ఇంటింటి సర్వేను అందుకు పూర్తి విరుద్ధంగా నిర్వహించింది. ఎన్యుమరేటర్లకు జనాభా సమాచారాన్ని, సర్వే చేయాల్సిన ఇండ్ల వివరాలను అందివ్వలేదు. కేవలం సర్వే పత్రాలనే అందజేసింది. ఎన్యుమరేటర్లే ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాలు ఇచ్చే వివరాలనే నమోదు చేసుకురావాలని ఆదేశించింది. ఎన్యుమరేటర్లు సైతం కుటుంబ సభ్యులు చెప్పిన కులం, వృత్తి, ఆస్తులు, ఆదాయ వివరాలనే నమోదు చేసుకున్నారు. ఆ వివరాలు సరైనవేనా? కాదా? అనేది సరిపోల్చుకున్న దాఖలాల్లేవు.
సర్వేకు గణాంకాలపై ఎస్సీ ఉపకులాలు, అత్యంత వెనకబడిన వర్గాలు (ఎంబీసీ), సంచారజాతులకు చెందిన మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 59 షెడ్యూల్డ్ కులాలను, 32 షెడ్యూల్డ్ తెగలను ప్రభుత్వం గుర్తించింది. ఎస్సీకి సంబంధించి అనేక కులాలు ఉన్నా రెవెన్యూ అధికారులు ఇప్పటికీ ఎస్సీ మాల, లేదంటే ఎస్సీ మాదిగ కులాల పేరిట సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలోని అనేక కులాల వాళ్లకు ధ్రువీకరణ పత్రాలు లేవు. బీసీ ‘ఏ’ గ్రూపు కింద 68, బీసీ ‘బీ’ గ్రూపు కింద 28, బీసీ ‘సీ’ గ్రూపు కింద క్రైస్తవం స్వీకరించిన దళితులను, బీసీ ‘డీ’ గ్రూపు కింద 51, బీసీ ‘ఈ’ గ్రూపు కింద 14 కులాలను గుర్తించింది. బీసీలకు సంబంధించి 23 కులాలను ఆ జాబితాలోంచి తొలగించింది.
ఏపీ నుంచి వలసవచ్చిన పలు బీసీ కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ చెల్లుబాటయ్యే కులాల పేరిట ధ్రువీకరణ పత్రాలు స్వీకరిస్తున్నారు. ఈ సర్వేలో కూడా అదేవిధంగా నమోదు చేసుకునే అవకాశముందని, వాటిని ఎక్కడా క్రాస్ చెక్ చేసిన పరిస్థితులే లేవని ఎంబీసీ వర్గాలు వివరిస్తున్నాయి. సంచారజాతుల ప్రజలకు ఇండ్లు కూడా లేవని, గూడారాలు వేసుకుని బతుకుతున్నారని, వారి లెక్కలను నమోదు చేయలేదని చెప్తున్నారు. ముందస్తుగా అధ్యయనం చేయించకుండా లెక్కలు తీయడంపై సామాజికవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా డాటా సేకరణ పూర్తిగా సంక్లిష్టంగా, సందేహాత్మకంగా మారిందని, ఇప్పటికైనా ఆయా అంశాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, తులనాత్మక అధ్యయనం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
తులనాత్మక అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం సర్వే నివేదికను వెల్లడించింది. పోనీ కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను ప్రకటించిందా? అంటే అదీ లేదు. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది. డాటా ప్రైవసీ యాక్ట్‌ను ఉటంకిస్తూ వివరాలను గోప్యంగా ఉంచింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 3.70 కోట్లు కాగా, వారిలో 16 లక్షల మంది (3.1 శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలు సేకరించినట్టు నివేదించారు. స్థూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలు వెల్లడించారు. బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం, ఓసీలు 15.79 శాతం, ఎస్టీలు 10.45 శాతమని తేల్చారు. పట్టణ జనాభా, గ్రామీణ జనాభా, వృద్ధులు, యువకులు, విద్యార్థులు, దివ్యాంగుల వివరాలు విడిగా ప్రకటించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ జనాభా తరహాలో జిల్లాల వారీ గణాంకాలను వెల్లడించలేదు.