ముషీరాబాద్, సెప్టెంబర్ 20 : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ, శంకర్‌మఠ్ వరకు వేలాది మందితో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఎన్నికల వాగ్దానాలు అమలుచేయడం లేదని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కాలాయాపన చేస్తుందని అరోపించారు. ఫీజు బకాయిలు రూ.4,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని, 42 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని, కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేముల రామకృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, అంజి, అనంతయ్య పాల్గొన్నారు.