హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన చేయడంతోపాటు, బీహార్‌లో బీసీ రిజర్వేషన్లను 60 శాతానికి పెంచారని, తమిళనాడులో 70 శాతానికి పెంచారని, పార్లమెంటులో అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను పెంచినప్పుడు 50 శాతం సీలింగ్ తొలగించారని, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కులగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని మంత్రిని కోరారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన బీసీ నేతల్లో గుజ్జ కృష్ణ, గోరేగే మల్లేశ్‌యాదవ్, నీలం వెంకటేశ్, రామకృష్ణ, అనంతయ్య, వంశీకృష్ణ, కృష్ణమూర్తి, ఉదయ్‌నేత, శివకృష్ణ, బలరామ్‌నాయక్, పర్వతాలు ఉన్నారు.