హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల (బీసీ) వాటా అత్యధికంగా ఉన్నది. బీసీలే తిరుగులేని శక్తిగా నిలిచారు. ముస్లిం మైనారిటీలు మినహా.. ఇతర బీసీల రాష్ట్ర సగటు 46.25 శాతంగా నమోదైంది. 3.54 కోట్ల జనాభాలో 1.64 కోట్లకు పైగా బీసీల సంఖ్య ఉన్నది. ప్రతి వంద మందిలో సుమారు 46 మంది బీసీ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 6,42,965 (63.09 శాతం) తో రాష్ట్రంలోనే అత్యధిక బీసీలు కలిగిన జిల్లా గా నిలిచింది. ఆ తర్వాత జోగుళాంబ గద్వాల (61.76%), రాజన్న సిరిసిల్ల (61.07%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అతి తకువగా హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 18,30,304 (29.81%) మంది మాత్రమే బీసీలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన సీపెక్ సర్వే వివరాలు, గణాంకాలను పరిశీలిస్తే అత్యధిక జనాభాతో బీసీలే అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలు, ఓసీలు, ముస్లిం మైనారిటీ వర్గాల జనాభా ఉన్నది.
ఎస్సీ జనాభాలో ఫస్ట్ రంగారెడ్డి..లాస్ట్ ములుగు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎస్సీ జనాభా 61,84,319 ఉన్నది. ఎస్సీ సగటు జనాభా శాతం 17.43 శాతంగా నమోదైంది. ఎస్సీల జనాభా రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉన్నారు. ఈ జిల్లాలో 3,36,426 మంది ఎస్సీలు ఉన్నారు. ఆ తర్వాత రెండోస్థానంలో ఖమ్మం (3,19,005), మూడో స్థానంలో నల్లగొండ (3,14,670) ఉన్నాయి. ఎస్సీల జనాభా తక్కువ ఉన్న జిల్లాల్లో ములుగులో 49,746 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆసిఫాబాద్లో 86, 207, భూపాలపల్లిలో 96,226 మంది ఉన్నారు. ఎస్సీల జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలుగా నాగర్కర్నూల్ (23.61), ఆ తర్వాత భూపాలపల్లి (23.35) నిలిచాయి. అతితక్కువ ఎస్సీ జనాభా శాతం ఉన్న జిల్లాలుగా నిజామాబాద్ (14.68), ఆదిలాబాద్ (14.90) ఉన్నాయి.
బీసీ, ఎస్సీల తర్వాత గిరిజనులే అధికం
రాష్ట్రంలో బీసీ, ఎస్సీల తర్వాత గిరిజనుల సంఖ్య అధికంగా ఉన్నది. రాష్ట్రంలోని 3.54 కోట్ల జనాభాలో వీరు 37,05,929 మంది (10.45%) ఉన్నారు. గిరిజన జనాభాలో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా 4,18,085 మందితో (40.37%) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా 3,22,361 మందితో (40.07%), ఆదిలాబాద్ జిల్లా 2,55,916 మంది (33.45%) వాటాతో గిరిజన ప్రభావం ఎకువగా ఉన్న జిల్లాలుగా నిలిచాయి. అతి తకువగా కరీంనగర్ (1.31%), జోగుళాంబ గద్వాల (1.82%) జిల్లాల్లో ఎస్టీ జనాభా నమోదైంది.
నగరాల్లోనే ముస్లిం మైనారిటీలు అధికం
తెలంగాణలో ముస్లిం మైనారిటీల సంఖ్య రాష్ట్ర సగటు 12.56 శాతంగా నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే అత్యధికంగా 28.89% ముస్లిం జనాభా ఉన్నది. నిజామాబాద్ (21.73%), సంగారెడ్డి (16.24%) జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అతి తకువగా జయశంకర్-భూపాలపల్లి (3.10%), ములుగు (3.24%) జిల్లాల్లో మైనారిటీలు ఉన్నట్టు తేలింది.
హైదరాబాద్లో ఓసీలే టాప్
రాష్ట్ర సగటు ఇతర కులాల (ఓసీ) జనాభా 15.79 శాతంగా నమోదైంది. హైదరాబాద్ (జీహెచ్ఎంసీ)లో అత్యధికంగా 35.99% మంది ఓసీలు ఉన్నారు. ఓసీ జనాభాలో మేడ్చల్-మలాజిగిరి (31.91%) రెండో స్థానంలో ఉన్నది. అతి తకువగా మహబూబాబాద్ (5.80%), మెదక్ (6.23%) జిల్లాల్లో ఓసీలు నివసిస్తున్నారు.
