కరీంనగర్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నదని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బీసీ నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందని స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తున్నదని గ్రహించిన కేసీఆర్ తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లను అధ్యయనం చేసేందుకు బీసీ నాయకులను అక్కడికి పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను ఆకట్టుకునేందుకు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించి బీసీల బతుకుల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కాలని చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడంలేదని, అధిష్ఠానం కూడా రేవంత్‌రెడ్డి ట్రాప్‌లో పడినట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే 9వ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక మార్గమని చెప్పారు. 42% రిజర్వేషన్ల డిమాండ్‌ను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచే పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 8న కరీంనగర్లో జరిగే బీసీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీ ఉద్యమాన్ని చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నదని తెలిపారు. శాసనమండలి మాజీ స్పీకర్ స్వామిగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల విషయంలో బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. అనంతరం జ్యోతిబాఫూలే గ్రౌండ్లో జరిగే సభాస్థలిని పరిశీలించారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు ఉన్నారు.