హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేసి, తీరా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని, నయ వంచనకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఈ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరుగుతాయన్న సంగతి తెలియదా? అని నిలదీశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయని తెలిసీ, మరి ఎం దుకు బీసీల చెవులో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఏదేదో చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి సర్కారు ఇంతకాలం నటిస్తూ వచ్చిందని దు య్యబట్టారు. జంతర్‌మంతర్ వద్ధ ధర్నాలు, జీవోలు, ఆర్డినెన్స్‌లు అంటూ డ్రామాలాడారే తప్ప, బీసీ బిల్లు కోసం ప్రధానిని, రాష్ట్రపతిని కలువలేదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కునే..
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడబలుక్కుని, బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించకుండా చేస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైగ చేయగానే, కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి పాటించారని ఎద్దేవా చేశారు. 42% రిజర్వేషన్లు లేకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడం అంటే బీసీలను అవమానించడమేనని పేర్కొన్నారు. బీసీలను మోసం చేయడంలో కాంగ్రెస్ బరితెగించిందని మండిపడ్డారు. ప్రగల్భాలు పలికిన బీసీ సంఘాల నా యకులు ఇప్పుడు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీలు బీసీలను జోకర్లుగా చూస్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాలను ఎండగట్టడం కోసం, చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయకులంతా.. ఏకతాటి మీదకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, వాటిని తగ్గిస్తే మోసం చేసినట్టు కాదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, గ్రామాల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి గ్రామీణ ప్రజలు ఉడికిపోతున్నారని చెప్పారు.
23 శాతానికి పడిపోతున్న బీసీ రిజర్వేషన్లు: జైపాల్‌యాదవ్
పార్టీపరంగా ఇచ్చే రిజర్వేషన్లు చట్టసమ్మతంకాదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలన్న సర్కారు నిర్ణయం బీసీలను మోసం చేయడమేనని విమర్శించారు. పార్టీపరంగా ఇస్తే రిజర్వేషన్లు 42 నుంచి 23 శాతానికి పడిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీలందరూ సంఘటితమై 42% రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.