మంచిర్యాలటౌన్/చెన్నూర్, అక్టోబర్ 11: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జాతీయ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలిచ్చి విస్మరించిందని మండిపడ్డారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తీరా హైకోర్టుకు వెళ్లి అభాసుపాలైందని అన్నారు. బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్‌పై ఒత్తిడి చేసి బిల్లుకు ఆమోదముద్ర వేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీకి యాభైసార్లు వెళ్లినప్పటికీ ఏ ఒక్కసారి కూడా బీసీ అంశాన్ని ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల అమలును రెడ్డి జాగృతి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివా రం చెన్నూర్ పట్టణంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. జలాల్ పెట్రోల్ పంపు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మహత్మా జ్యోతి బాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీసీ ఐక్య వేదిక నాయకుడు సిద్ది రమేశ్ మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.