హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో బీసీ పంచాయితీ ముదురుతున్నది. కాంగ్రెస్‌లో బీసీ నేతలను చిన్నచూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారని, బీసీ డిక్లరేషన్ కూడా చేయనీయలేదని మండిపడ్డారు. బీసీలంటే కేవలం ఓట్లేసే యంత్రాలేనా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన అంబర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో బీసీలకు వ్యతిరేకంగా ఎన్నో జరుగుతున్నాయని చెప్పారు. భువనగిరి, ఆలేరు సీట్లను బీసీలకు కేటాయిస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంబర్‌పేట టికెట్‌ను గత ఎన్నికల్లో లక్ష్మణ్‌యాదవ్‌కు ఇప్పించానని, నామినేషన్ వేసిన తర్వాత కోదండరాం మేనేజ్ చేయడంతో బీసీ అభ్యర్థితో విత్‌డ్రా చేయించారని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టిన నూతి శ్రీకాంత్‌గౌడ్‌కు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌లో పాత నేతలందరినీ వెళ్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తనపై కుట్ర చేస్తే ఉత్తమ్ చేసినవన్నీ బయటపెడుతానని హెచ్చరించారు.