హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే బీజేపీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన బీసీ బంద్‌కు మద్దతు కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కలిసేందుకు బుధవారం బీసీ నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ నేతలు రాంచందర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా బీసీ నేతల మధ్య ఫొటో విషయంలో తలెత్తిన గొడవ పరస్పరం దాడులకు దారి తీసింది.
మీడియా ప్రతినిధులు దీనిని వీడియో తీస్తుండగా కొందరు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తన ఎదుటే గొడవ జరగడంతో రాంచంద్రరావు నిర్ఘాంతపోయారు. గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మరోవైపు, ఇటీవల మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో సైతం మాజీ ఎంపీ వెంకటేశ్‌నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ బూతులు తిట్టుకున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తుంటే వారి ముందు నేతలు బూతులు తిట్టుకోవడం విమర్శలకు దారి తీసింది.