ఖైరతాబాద్, జూన్ 20: సమగ్ర కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాలతో కలిసి గురువారం ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై ప్రైవేట్ వ్యక్తులతో కోర్టులో కేసు వేయించి న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టి దొడ్డి దారిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే జూలై 15న బీసీలతో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. దివంగత ప్రధాని నెహ్రూ నాడు కాకా కాలేల్కర్ కమిషన్‌ను అడ్డుకుంటే, ఇందిరాగాంధీ మండల్ కమిషన్ రిపోర్టును కోల్డ్ స్టోరేజీలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రిజర్వేషన్లిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని పార్లమెంట్ సాక్షిగా రాజీవ్‌గాంధీ మాట్లాడటం బీసీలపై గాంధీ కుటుంబానికి ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. సమావేశంలో బీసీ హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధేశ్వర్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ దత్తాత్రేయ, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు శారదాగౌడ్ పాల్గొన్నారు.