కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 13 : బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, పెద్దపల్లిలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుటతో పాటు పలు మండలాల్లో దీక్షలు నిర్వహించారు.
పెద్దపల్లిలో దీక్షా శిబిరాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. జీవోలు, ఆర్డినెన్స్లతో కాలయాపన చేస్తూ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు.