హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల విషయంలో నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొందపెడ్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేదర్ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో ఎందుకు చర్చించలేదని సర్కార్‌ను నిగ్గదీశారు. చట్టపరంగా ఇవ్వలేనప్పుడు పార్టీ పరంగానైనా ఇస్తామని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీసీలకు ద్రోహం తలపెడుతున్నాయని ఆరోపించారు. ధర్నాలో బీసీ జేఏసీ నేతలు గుజ్జ కృష్ణ, కుందారం గణేశ్‌చారి, కులచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్‌గౌడ్, కనకాల శ్యామ్, దీటి మల్లయ్య, లింగంగౌడ్, సదానందం, రాజేందర్, తారకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.