హైదరాబాద్, మార్చి31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు తప్పుల తడకగా కులగణన నిర్వహించింది. అసంబద్ధ గణాంకాలతో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతున్నామంటూ అసమగ్రంగా బిల్లులు రూ పొందించి అసెంబ్లీలో ఆమోదించింది. ఇప్పుడవి ఎక్కడున్నాయో? కూడా తెలియదు. గవర్నర్ ఆమోదానికి పంపారో? లేదో? కూడా స్పష్టతలేదు. రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు సర్కారు జీవోలను కూడా ఇవ్వలేదు! ఒకవేళ ఇచ్చినా అమలు కష్టమేనన్న సంగతి కాంగ్రెస్కు తెలుసు. పైగా రిజర్వేషన్లు, బీసీల కులగణనను ఆది నుంచీ అడ్డుకుంటున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇవన్నీ తెలిసినా 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ కేంద్రంగా ధర్నా పేరిట కొత్త డ్రామాకు తెరలేపింది.
ఇందుకోసం పలు అనుకూల సంఘాల నేతలను ప్రత్యేక రైళ్లలో పంపింది. కేవలం బీసీలను వంచించేందుకు, తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు, రిజర్వేషన్ల అంశాన్ని తప్పించుకునేందుకే ఈ డ్రామాలు తప్ప మరేమీ కాదని పలు కుల సంఘాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. చట్టం చెప్తున్నదేమిటంటే బీసీలకు సంబంధించి విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కల్పన, పెంపు అనేది రాష్ట్ర బీసీ కమిషన్ ఇచ్చే నివేదికలు, సిఫారసుల మేరకే జరగాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలు చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రస్తుతం డెడికేటెడ్ కమిషన్ సిఫారసులతోనే బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను పెంచింది. చట్టం ముందు ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచే ప్రసక్తే లేదని న్యాయకోవిదులే వెల్లడిస్తున్నారు.
తప్పించుకునేందుకు నాటకం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లులు ఎక్కడున్నయో? ఇప్పటికీ తెలియదు. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ నివేదికలను అధికారికంగా శాసనసభ, శాసనమండలిలో ఎక్కడా సర్కారు వెల్లడించలేదు. బిల్లులను అమల్లోకి తెస్తూ ఎలాంటి జీవోలను కూడా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్ర చట్టాల అమలుకు కేంద్ర అనుమతి అవసరం లేదు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండానే, 9వ షెడ్యూల్ పేరిట కొత్త డ్రామాకు తెరతీసింది. న్యాయసమీక్ష పరిధిలోకి రాకుండా రాజ్యాంగ సవరణ చేసి బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న నాటకానికి తెరలేపింది. 9వ షెడ్యూల్లో చేర్చినంత మాత్రాన పూర్తిగా రక్షణ లభించినట్టు కాదని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
అయినా కాంగ్రెస్ కొత్త డ్రామాకు తెరతీసింది. తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు, బీసీలకు ఇచ్చిన హామీని అటకెక్కించేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ఇలా చేస్తున్నదని బీసీ సంఘాల నేతలే విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని, అది తెలిసీ కాం గ్రెస్ డ్రామా ఆడుతున్నదని చెప్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ముందు రిజర్వేషన్లను అమలు చే యాలని, కోర్టు వివాదాలు తలెత్తితే అప్పుడు డిమాండ్ చేయవచ్చని, కానీ అవేవీ చేయకుండానే 9వ షెడ్యూల్ ప్రస్తావన తేవడం ఆ పార్టీ మోసపూరిత విధానానికి నిదర్శనమని స్పష్టంచేస్తున్నారు. కొన్ని బీసీ సంఘాలను పోగుచేసి, రైళ్లలో ఢిల్లీకి పంపి ధర్నా పేరిట నాటకాలకు దిగడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
సర్కారు ప్రోద్బలంతో హస్తినకు
సర్కారు ప్రోద్బలంతోనే కొన్ని బీసీ సం ఘాలు ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లాయని బీసీ మేధావులు, పలు కుల సంఘాల నేతలు బాహాటంగానే చెప్తున్నారు. అనుకూలమైన మేధావి వర్గాన్ని, కులసంఘాల నేతలను ముందుపెట్టి ఇంటింటి సర్వే, బిల్లుల రూపకల్పన మంత్రాంగాన్ని నడిపిస్తూ వచ్చిందని భగ్గుమంటున్నారు. బీసీ రిజర్వేషన్లలను అమలులోకి తేకముందే కొన్ని సంఘాలు హడావుడి చేస్తూ, సర్కారుకు జేజేలు కొడుతున్నాయని విమర్శిస్తున్నారు. డ్రామాలో భాగంగానే రేపు (బుధవారం) ఢిల్లీలో బీసీల పోరుగర్జన చేపట్టారని ఆరోపిస్తున్నారు.