తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులాల సర్వేలో బీసీ కులాల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి. మొత్తం 3.54 కోట్ల రాష్ట్ర జనాభాలో 133 బీసీ కులాల జనాభాను 46.25 శాతంగా మాత్రమే చూపిస్తున్నారు. కానీ, ముస్లిం మైనారిటీ బీసీలు 10శాతం కలిపి బీసీల జనాభాను 56 శాతంగా చూపించడం నివేదిక డొల్లతనాన్ని బయటపెడుతున్నది. ఒక బీసీలే 52శాతం జనాభా ఉన్నారని 2015లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే బయట పెడితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారంగా 46 శాతం ఎలా ఉంటారు. రాష్ట్రంలో 133 బీసీ కులాలు ఉంటే 69 కులాలు మాత్రమే అత్యంత వెనుకబడిన కులాలు అని చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం.
కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణనలో పద్మశాలీలకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 2015లో 18 లక్షల జనాభాను చూపించారు. సర్కార్ తాజాగా ప్రకటించిన కులగణన సర్వేలో పద్మశాలీలను కేవలం 11,79,031గా చూపించింది. 11 ఏండ్లలో జనాభా పెరగాలి కానీ తగ్గుతుందా? ఇది పూర్తిగా బీసీల్లో పద్మశాలీలను అణగదొక్కే ప్రయత్నంగానే భావిస్తున్నాం.

ఉద్దేశపూర్వకంగానే జనాభాను తక్కువగా చూపిస్తున్నారు. వాస్తవానికి 30 లక్షల నుంచి 35 లక్షల జనాభా ఉన్నది. 18 లక్షల ఉన్న జనాభా 11 లక్షలకు ఏట్లా వస్తది? అందులో 19 ఉపకులాలు ఉండగా ఉపకులాలు ఊసేలేదు. వారికి నచ్చినట్టు మార్పులు చేసుకొని డిక్లేర్ చేసుకున్నారు. ఎక్కువ జనాభా చూపిస్తే ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ల అధికారం కోసం, సీట్ల కోసం పద్మశాలీలను బలిపెట్టారు.
రాష్టంలో బీసీలను అణగదొక్కే కుట్ర జరుగుతున్నది. ఇందులో భాగంగానే షేక్‌లు (ముస్లింలు) బీసీల్లో అత్యధికంగా ఉన్నారని ప్రభుత్వం చూపుతున్నది. బీసీలను తక్కువ చేసి చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.

బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రగా బీసీ సమాజనం భావిస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపుతున్నది. ప్రభుత్వం చూపుతున్న బీసీ గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే మొత్తం ఫేక్. 1961 జూన్ 16న మున్నూరు కాపుల జనాభా 35 లక్షలు ఉండగా 65 ఏండ్ల తర్వాత చేపట్టిన కుటుంబ సర్వేలో 13.70 లక్షలకు పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. 65 ఏండ్లలో 22 లక్షల జనాభా తగ్గడమనేది విచిత్రం ఉన్నది.

అనేక కులాల జాబితాలు కూడా తప్పుల తడకగా ఉన్నాయి. రాష్ట్రంలో ముదిరాజ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓసీలో రెడ్లే ఎక్కువగా ఉన్నారని చూపించడం హాస్యాస్పదం. బీసీలంతా ధనవంతులుగా చిత్రీకరించడం సరికాదు. బీసీల్లో అత్యధికులు షేక్‌లు ఉన్నారంటూ ప్రభుత్వం వింత నివేదికను వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులగణన అంతా తప్పుల తడకగా ఉన్నది. జనాభాలో 60శాతానికి పైగా ఉన్న బీసీలను 46శాతంగా చూపించి వారి హక్కులను కాలరాసేవిధంగా చేపట్టిన సర్వేగా భావిస్తున్నాం. బీసీలను ఇప్పటికీ అన్ని రాజకీయపార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి.

బీసీలు ఎప్పటికీ వారి బోయిలుగానే ఉండాలని రాజ్యాధికారం దక్కవద్దనే ఉద్దేశంతోనే ఈ కులగణన జరిగింది. మేమేంతో మాకు అంత వాటా దక్కాలి. కాంగ్రెస్ పార్టీ మరోసారి పారదర్శకంగా కులగణన చేపట్టాలి.