హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ రిపోర్టును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం అత్తాపూర్ గ్రామస్తుడు జీ రమేశ్‌గౌడ్ గురువారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ టీ మాధవీదేవి విచారించారు.
రిజర్వేషన్ల ఖరారు తప్పులతడకగా జరిగిందని, జీవో ద్వారా గైడ్‌లైన్స్ జారీ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయడం చట్టవ్యతిరేకమని న్యాయవాది సంతోష్‌కుమార్ వాదించారు. ఇది రాజ్యాంగంలో ని అధికరణ 243డీ, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9, 17లకు వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం గడువు కోరడంతో విచార ణ శుక్రవారానికి వాయిదా పడింది.