హైదరాబాద్, నవంబర్23 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. జీవో9 విడుదల చేసిన ప్రభుత్వమే ఇప్పుడు జీవో 46తో బీసీలకు తీరని ద్రోహం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. 46ను రద్దు చేసేవరకూ ప్రభుత్వంపై బీసీల పోరు ఆగబోదని హెచ్చరిస్తున్నారు. బీసీలను కాంగ్రెస్ నమ్మించి వంచించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవో46ను రద్దు చేయాలని, లేకుంటే బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కాంగ్రెస్ సర్కార్‌ను బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా సహా పలుచోట్ల ఆదివారం 46జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. బీసీలకు కేవలం 18 శాతం రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయని కృష్ణయ్య, జాజుల ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరితో బీసీలు రాజకీయ సమాధి అవుతారని ధ్వజమెత్తారు. జీవో రద్దు చేసేవరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతామని హెచ్చరించారు. జీవోల పేరిట బీసీల చెవుల్లో కాంగ్రెస్ పూలు పెట్టిందని, ఈ మేరకు చెవిలో పూలతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రైవేట్‌గా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎస్సీలకు కాంగ్రెస్ ధోకా: బైరి వెంకటేశం
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 ద్వారా ఎస్సీలను వంచించిందని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు వార్డు స్థానాల్లో 2024 కులగణన సర్వే ప్రకారం, సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. అన్నింటికీ 2024 సర్వేను ఎందుకు ప్రామాణికంగా తీసుకోలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా 2011 నుంచి 2024 దాకా పెరగలేదా అని పేర్కొన్నారు.
బీసీల గొంతుకోసిన కాంగ్రెస్: జూలూరి గౌరీశంకర్
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46తో బీసీల గొంతు కోసిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46ను వెనక్కి తీసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్షగా ఇచ్చే రిజర్వేషన్లను బీసీ సమాజం ఒప్పుకోబోదని, న్యాయబద్ధమైన హకులను బీసీలు డిమాండ్ చేస్తున్నారని స్పష్టంచేశారు. బీసీలు మోసపోవడానికి ఇంకా సిద్ధంగా లేరనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. బీసీలకు కాంగ్రెస్ చేసిన దగాపై సామాజిక బాధ్యతగా కవులు, రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను వినిపించాలని జూలూరు పిలుపునిచ్చారు.