హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌తో ఆర్టీసీ బస్సులు (RTC Bus) ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపడంతో ప్రభుత్వ నిర్ణయం, పోలీసుల సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు బస్సులను డిపోలకే పరిమితం చేశారు.
రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు బస్ డిపోల ఎదుట బైఠాయించి, బీసీ ఉద్యమ నినాదాలతో హోరెత్తించారు. బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, టీజేఎంయూ, ఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్టీయూసీ కూడా మద్దతు తెలపడంతో బస్సులు పూర్తిస్థాయిలో డిపోల్లోనే నిలిచిపోయాయి.
కొన్నిచోట్ల మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు డిపోల నుంచి బయటికి వచ్చినా.. ధర్నాలు, రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల నుంచి పాక్షికంగా.. 5 గంటల తర్వాత పూర్తిస్థాయిలో అన్ని బస్సులు బయటికి వచ్చాయి. బంద్‌తో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నారని, మధ్యాహ్నం నుంచి సాయంత్ర వరకూ 25 శాతం బస్సులు తిరిగినా ఆశించిన స్పందన కనిపించలేదని అధికారులు తెలిపారు. బస్సులపై ఎక్కడా దాడులు జరగలేదని వెల్లడించారు. బంద్‌తో వాటిల్లిన నష్టంపై ఆదివారం పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు.