42శాతం కోటా ఇవ్వకుండా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పార్టీ గుర్తులే లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామనడం ఒక వింత అయితే.. గాంధీభవన్లో నిర్ణయిస్తే జరిగిపోయే కాంగ్రెస్ టికెట్ల కోటాపై క్యాబినెట్ తీర్మానం మరో విచిత్రం!
BC Reservations | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ధోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. చివరకు వారిని మోసగించింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వపరంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు ఇస్తామని ప్రకటించింది. ఇక ‘నమస్తే తెలంగాణ’ ముందే చెప్పినట్టుగా డిసెంబర్ 9వ తేదీ తర్వాతే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రానున్నది. డిసెంబర్ ఒ కటి నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించిన అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల ప్రక్రియకు పంచాయతీరాజ్ శాఖ, తెలంగాణ ఎన్నికల సంఘం దృష్టిపెట్టాయి.
ఓసీలతో బీసీలు పోటీపడగలరా?
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగవు. అలాంటిప్పుడు బీసీలకు కాంగ్రెస్ ఎలా న్యాయం చేస్తుందని బీసీవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే.. హక్కుగా బీసీలు మాత్రమే పోటీచేసే అవకాశం లభిస్తుంది. పార్టీపరంగా ఇవ్వడం అనేది దయగా మారుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 42% స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించినా, మిగతా పార్టీలు అగ్రవర్ణాలకు చాన్స్ ఇస్తే… అంగబలం, అర్ధబలం ఉన్నవారితో బీసీలు పోటీపడలేక ఓడేపోయే ప్రమాదం ఉన్నది. పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు చెప్పడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. పార్టీపరంగా ఇచ్చేదానికి ఇన్నాళ్లు ఎందుకు నాన్చినట్టు, బీసీలను ఎందుకు మోసం చేసినట్టు? అని ప్రశ్నిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా, 23 శాతానికే పరిమితం చేస్తే గత నోటిఫికేషన్లో బీసీలకు కేటాయించిన సీట్లలో సగానికి సగం తగ్గనున్నాయి. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుపై, పార్టీ పరంగా జరుగుతాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఆయా ఎన్నికలను బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పులను అనుసరించి నిర్వహిస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాదానికి నిదర్శనమని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
బీసీలకు 42% నుంచి 23 శాతానికే
రాష్ట్ర క్యాబినెట్ తాజా నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వపరంగా బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 23 శాతానికి తగ్గతున్నాయి. మిలిగిన 19% స్థానాలను జనరల్ క్యాటగిరీలో కలుపనున్నారు. ఈ ఏడాది సెస్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు ఉన్నాయి. ఇందులో డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను ప్రమాణికంగా తీ సుకొని 23% స్థానాలను బీసీలకు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉం డనందున, మిగతా స్థానాలను జనరల్ క్యాటగిరీ జాబితాలోకి చేర్చనున్నారు.