‘బీసీ జనాభా ఏమీ తగ్గలె.. బీసీలే కావాలని సర్వేలో పేర్లు ఎక్కించుకోలే.. సర్వే జరిగేటప్పుడు ఎక్కడికిపోయిండ్రు? తీరా ఇప్పుడొచ్చి అడుగుతున్నరు’.. ఇదీ అసమగ్ర సర్వే నివేదికపై ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధావులకు ప్రభుత్వ పెద్దల దబాయింపు. సర్వే సమయంలో మాట్లాడలేదేమంటూ బీసీ నేతలనే సర్కారు నిందిస్తున్నది. తప్పులు ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోకుండా ఎదురుదాడికి దిగడమేమిటని ప్రభుత్వంపై కులసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ) : సర్వే గణాంకాలపై ప్రభుత్వ పెద్దలు వివి ధ వేదికలపై ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. గతంలో ఎలాంటి సర్వే నివేదికలు, ప్రామాణికమైన బీసీ గణాంకాలు లేవని, ప్రస్తుత సర్వే లెక్కలే కచ్చితమైనవి అంటూ ప్రభుత్వ పెద్దలు దబాయిస్తున్నారు. జాతీయ సర్వే నివేదికలు, ఇతర ప్రభుత్వ అధికారిక డాటా కన్నా.. రాష్ట్ర జనాభా ప్రస్తుతం దాదాపు 60 లక్షలకు పైగా తగ్గిందని బీసీ ప్రతినిధులు అడిగితే రాష్ట్ర జనాభా వృద్ధిరేటు తగ్గిందంటూ దాటవేస్తున్నారు. సర్వేకు సహకరించలేదని బీసీలపైనే నిందలు వేసేందుకూ సర్కారు పెద్దలు వెనుకాడటం లేదు. బీసీ సంఘాలు, మేధావులు, సామాజిక వేత్తలు, ఇతర తెలంగాణ సమాజం లేవనెత్తుతున్న ఏ ప్రశ్నకూ సూటిగా బదులివ్వకపోగా, తిరిగి ప్రశ్నించడం, లేదంటే గతంలో నివేదికలు బయట పెట్టలేదని ఎదురుదాడికి దిగే విధానాలనే ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్నారు. సర్వే నిర్వహణలో లోపాలు దొర్లాయని ఒకవైపు సొంత పార్టీ నేతలు, బీసీ కమిషన్ చెప్తున్నా, ప్రభుత్వ పెద్దలు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటం గమనార్హం. సర్వేను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇలా ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ ప్రభుత్వం ఇదే రీతిన వ్యవహరించిందని అక్కడ పాల్గొన్న బీసీ ప్రతినిధులే వాపోతున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా కొనసాగిందని, గణాంకాలన్నీ అసంబద్ధంగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేలో దొర్లిన పొరపాట్లను, గణాంకాల్లోని తేడాలను సహేతుకమైన ఆధారాలతో బీసీ సంఘాల నేతలు, మేధావులు, సామాజిక వేత్తలు వివరిస్తున్నారు. జాతీయ సర్వే నివేదికలు, డాటాలను ఉదహరిస్తూ రీ సర్వే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సర్కారు మాత్రం అదేమీ లేదంటూ, పూర్తిగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించామంటూ పదేపదే సమర్థించుకుంటూ వస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఇంటింటి సర్వే గణాంకాలను వెల్లడించింది. రాష్ట్ర జనాభా మొత్తంగా 3.70 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం సైతం 1.03 లక్షల ఇండ్లు తలుపులు వేసి ఉండటం, 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలతో 3.1 లక్షల కుటుంబాల వివరాలను, మొత్తంగా 16 లక్షల జనాభా వివరాలను సేకరించలేదని ప్రభుత్వమే ప్రకటించింది. బీసీల జనాభా 46.25%, ముస్లిం బీసీలు 10.08% కలుపుకుంటే మొత్తంగా 56.33 శాతమని, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%గా నిర్ధారించింది. ఈ గణాంకాలపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి అసంబద్ధమని బీసీ సంఘాలు తేల్చిపారేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం పూర్తి శాస్త్రీయంగా తేల్చామని సమర్థించుకుంటున్నారు.
సర్వే లోపాలను సరిదిద్దే అంశంపై సూటిగా జవాబివ్వకుండా ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగుతుండటంపై బీసీ సంఘాలు, మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. కులగణనకు అనుసరించాల్సిన పద్ధతులు, నిబంధనలపై ప్రభుత్వానికి ఆది నుంచీ అనేక సలహాలు, సూచనలు ఇచ్చామని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్, ఇతర కుల సంఘాలు చెప్తున్నాయి. ఇదే విషయమై సమగ్రమైన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశామని ఆ సంఘం నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహులగాంధీ నిర్వహించిన సమావేశంలోనూ పాల్గొని అనేక విలువైన సూచనలు చెప్పామని, జరుగుతున్న లోపాలను ఎత్తిచూపామని చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని వారితోపాటు ఇతర కులసంఘాల నేతలు, మేధావులు దుయ్యబడుతున్నారు. నిపుణుల కమిటీని కూడా వేయలేదంటే సర్కారు ఉదాసీనతకు అద్దంపడుతుందని తెలుపుతున్నారు. ఇంటింటి సర్వే కోసం రూపొందించిన ప్రశ్నావళితో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని, దానిని సరళీకృతం చేయాలని సూచించినా పెడచెవిన పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వే ప్రాధాన్యంపై ప్రభుత్వం సరైన ప్రచారం కూడా చేయలేదని, ప్రజలను సంసిద్ధులను చేయలేదని, దీంతో ఎవరూ వివరాలను నమోదు చేయించుకోలేదని, ఈ విషయాలను సర్కారుకు గుర్తుచేసినా నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేస్తున్నారు. యాప్‌ను కూడా రూపొందించలేదని వివరిస్తున్నారు.
కులగణన విషయంలో అన్ని దశల్లోనూ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగిందని బీసీ సంఘాలు, మేధావులు ధ్వజమెత్తుతున్నారు. ఫలితంగానే సర్వేలో జనాభా లెకలు తగ్గాయని వివరిస్తున్నారు. ఇప్పటికీ ఆ తప్పులను సవరించే ప్రయత్నం చేయకుండా తమపైనే ఎదురుదాడికి దిగడమేమిటని నిప్పులు ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపై సమర్థించుకోవడం సరికాదని, తమ సూచనలను పట్టించుకోవాలని హితవు పలుకుతున్నారు. ఎట్టి పరిస్థితులలోనైనా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టు ప్రభుత్వ కదలికలను గమనిస్తే తెలుస్తుందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా స్థానిక ఎన్నికల నిర్వహణనే పరమావధిగా ప్రభుత్వం చర్యలకు సిద్ధపడడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా బీసీ సమాజం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను గమనించి, కుల సర్వేను తిరిగి నిర్వహించాలని, డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పణకు తగినంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని కులసంఘాల నేతలు, మేధావులు హెచ్చరిస్తున్నారు.