చట్టబద్ధమైన రిజర్వేషన్లను కల్పించకపోవడమంటే స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కుదించడమే. పల్లె పాలన పగ్గాలు వారికి అందకుండా చేయడమే. జనాభా పరంగా మేజర్ వాటాగా ఉన్నా.. పదవులు మాత్రం పరిమితంగా దక్కుతున్నాయని బీసీలు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఓపెన్ కోటా సీట్లలో వెనుకబడిన వర్గాలవారు నిలబడి, గెలవడం కష్టసాధ్యంగా మారిందని చెప్తున్నారు. గత రెండు దఫాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గణాంకాలను విశ్లేషిస్తే వారి వాదన నిజమని స్పష్టమవుతున్నది. రెండు విడుతల్లోనూ జనరల్ స్థానాల్లో నిలిచి, గెలిచిన బీసీలు 20శాతం లోపే. అందుకే బీసీల జనాభాకు తగ్గట్టు రాజకీయ అవకాశాలు కావాలంటే చట్టబద్ధత ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్20 (నమస్తే తెలంగాణ): దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలకే పరిమితం. వాటికే చట్టబద్ధత ఉంది. రాజకీయం అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్ అనేదే లేదు. స్థానిక సంస్థల్లో మాత్రం ఆర్టికల్ 243-డీ(6), 243-టీ(6)లను ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాలకు తోచినంతగా లాటరీ పద్ధతిలో, ర్యాండమ్‌గా ఎంపిక తదితర అశాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించడం, ప్రతిసారి వాటిపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ‘ట్రిపుల్-టీ’ పేరిట స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలను చట్టబద్ధంగా కల్పించాలని బీసీ సంఘాల నేతలు ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారు. చట్టబద్ధత లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నామని వాపోతున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా మలుచుకొన్నది. ‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 6నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డిలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించింది. కులగణన నిర్వహించి, 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా.. ఇప్పుడు మాట మార్చింది. చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలోనే బీసీలకు 42 శాతం కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డ్మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ స్థానాలకు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లు, మేయర్ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. 2019, 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మేరకే బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున కేటాయించారు. ఆ ప్రకారమే ఎన్నికలు నిర్వహించి, ఆయా వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలు కల్పించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కల్పించిన రిజర్వేషన్లను కాకుండా, ఇటు 42శాతం రిజర్వేషన్ కాకుండా పార్టీ కోటాలోనే అమలు చేయాలని చూస్తున్నది. అదే జరిగితే స్థానికసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లు మినహా మిగిలిన సీట్లన్నీ జనరల్ కోటాగానే మారిపోనున్నాయి. అదే జరిగితే బీసీల రాజకీయ అవకాశాలకు గండి పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల స్థానాల్లో కలిపి చూసినా సగటున 20 శాతం కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పార్టీ పరంగా అంటే బీసీల అవకాశాలకు గండిపడినట్టే!
బీసీ సంఘాల నేతలు, కులసంఘాల ప్రతినిధులు, మేధావులు కాంగ్రెస్ చెప్తున్న పార్టీ కోటాపై మండిపడుతున్నారు. ‘పార్టీ కోటా మాకెందుకు? చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందే’ అంటూ తెగేసి చెప్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని రాష్ట్రంలోని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను, అదీకూడా బీసీ ఉపకులాల వారీగా కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సర్కారు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. అలా కాకుండా గతంలో మాదిరిగానే ఎన్నికలను నిర్వహించేందుకు, పార్టీ పరంగానే రిజర్వేషన్లనే కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమడం దారుణమని, తీవ్రస్థాయిలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీచేస్తున్నారు. బీసీలకు చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటా ఇస్తామనడం వెనుక పెనుకుట్ర దాగిఉందని బీసీ మేధావులు, రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. పార్టీ కోటాలో ఇచ్చినా రెబల్స్ అభ్యర్థులను నిలువరించేదెవరని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పార్టీ కోటాలో బీసీలు ఓడితే మొత్తంగా బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయవచ్చనే కుట్ర దాగి ఉందని నిప్పులు చెరుగుతున్నారు.
బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది. రాజకీయంగా అణచివేసే కుట్రలో భాగంగానే ఇప్పుడు పార్టీ కోటా అంటున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందే. కేంద్రప్రభుత్వం మీద నెపంనెట్టి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోం. పార్టీ కోటా కాకుండా చట్టబద్ధంగానే 42శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదు.
– జకే వీరస్వామిగౌడ్, సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
