హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి మీడియా సమక్షంలో సహచర మంత్రిపై చూపిన అనుచిత ప్రవర్తనపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మీడియా ముందు ఉన్నామనే సో యి లేకుండా కాగితాలను మంత్రి ముఖాన విసిరికొట్టారు. శనివారం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను సహచర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి వెల్లడించారు. ఈక్రమంలో పక్కనే ఉన్న వాకిటి శ్రీహరి కల్పించుకొంటూ తన వద్ద ఉన్న ఏదో సమాచారానికి సంబంధించిన పేపర్‌ను పొంగులేటికి అందించారు. పేపర్ ను చూపిస్తూ ఏదో వివరించారు.
క్షణకాలం పాటు శ్రీహరి ఇచ్చిన పేపర్‌ను తీక్షణంగా చూసిన పొంగులేటి తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రతులను తిరిగి శ్రీహరి ముఖంపైకి విసిరేశారు. ఊహించని ఈ హఠాత్ పరిణామంతో శ్రీహరి నివ్వెరపోయారు. దాదాపు నాలుగు సెకన్లపాటు మాత్రమే ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తమ సామాజికివర్గానికి చెందిన మంత్రిపై పొంగులేటి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారంటూ బీసీ సంఘాలు నిరసన తెలిపాయి.