హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ చర్యల మూలంగా ఇక ఫీజు బకాయిలు ఇవ్వనట్టేనని తెలుస్తున్నది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపుల అంశంపై ప్రభుత్వం జీవో-9 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కేవలం 2026-27విద్యా సంవత్సరం నుంచి ఫీజు చెల్లింపుల విధానాన్ని మాత్రమే ప్రకటించింది. కానీ, రూ.10వేల కోట్లకుపైగా ఉన్న బకాయిల సంగతిపై మాత్రం ప్రభుత్వం ఊసెత్తడం లేదు.
ఇప్పటివరకు బకాయిల చెల్లింపుపై పూటకోమాటతో రెండున్నరేండ్లుగా నాన్చుతూ వచ్చిన సర్కార్, తాజాగా వాటిని చెల్లించేది లేదని తెగిసి చెబుతున్నదని కాలేజీ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వెరసి ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడిపెంచుతున్నాయి. ఇటు సర్కార్, అటు కాలేజీల వ్యవహారంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికందక.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తుందని బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు వాపోతున్నారు.
రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500లకు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఉపకారవేతనాలూ చెల్లిస్తున్నది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకానికి సంబంధించిన నిధుల విడుదల పూర్తిగా నిలిపేసింది. వాస్తవంగా ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు 3 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు తీసుకొచ్చింది.
దాని ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభంలో 25శాతం, మధ్యలో 50శాతం, చివర్లో మరో25 శాతం చెల్లించాల్సి ఉన్నది. కానీ, ప్రభుత్వం ఆ విధానానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీతలతో స్కీమ్‌కు సంబంధించి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు మాత్రం ఇస్తున్నది.
ఇలా సుమారు రూ.2,200కోట్లకు పైగా విడుదల చేస్తున్నట్టుగా బీఆర్వోలు జారీ చేసింది. కానీ, వాస్తవంగా ఆ నిధుల్లో రూ.300కోట్లకు మించి ఆయా శాఖల ఖాతాల్లో జమకాని దుస్థితి నెలకొన్నది. కాలేజీలకు విడుదల చేసింది అంతకన్నా లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు కలిపి దాదాపు రూ.10వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసినట్టు చెప్పుకొంటున్న నిధులు పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా రూ.12వేల కోట్లకుపైగా బకాయిలు చేరాయని తెలుస్తున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీసీ సంఘాల నేతలు, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. నిరుడు బకాయిల కోసం యాజమాన్యాలు కాలేజీల బంద్ చేపట్టాయి. కులసంఘాలు, విద్యార్థుల ఒత్తిడితో సర్కార్ సైతం నిధులు చెల్లిస్తామని బుజ్జగించింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రెగ్యులర్‌గా విడుదల చేస్తామని, బకాయిలను మాత్రం వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని 2024లో జేఎన్టీయూ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు.
అయినప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీంతో కాలేజీ యాజమాన్యాలు మరోసారి ప్రభుత్వ పెద్దలను కలిసి నిధుల కోసం మొరపెట్టుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఉన్నత విద్యాశాఖ అధికారులను కలిసి వేడుకున్నాయి. 2025-26 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. చేసేది లేక కాలేజీ యాజమాన్యాలు మరోసారి ఏకంగా డిగ్రీ పరీక్షలనే బహిష్కరించాయి. దీంతో నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం టోకెన్లు జారీ చేసి మభ్యపెట్టింది. ఆ తరువాత మాటమార్చి ట్రస్ట్ ద్వారా, సీఎస్ఆర్ ఫండ్‌తో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను నిర్వహిస్తామంటూ ప్రగల్భాలు పలికింది.
ట్రస్ట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు 2024 నవంబర్‌లో ఆయాశాఖల అధికారులు, కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు కలిపి 13మందితో ప్రత్యేక కమిటీని నియమించింది. 3 నెలల్లో సమర్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పొందుతున్న అన్ని కాలేజీల్లో తక్షణం తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హయ్యర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకు ప్రభుత్వం 2025 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీలు చేపట్టి నివేదికను సమర్పించడంతోపాటు నోడల్ ఏజెన్సీతో కలిసి స్కీమ్‌కు సంబంధించి ప్రత్యేకంగా సిఫార్సులు చేయాలని విజిలెన్స్ డీజీని సర్కార్ ఆదేశించింది. అయినప్పటికీ అది కూడా జాడలేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే నిధులు విడుదల చేస్తామంటూ తాజాగా జీవో-9 విడుదల చేసింది.
ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం మూలంగా నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల ద్వారా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఏటా 14 లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతోనే అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ముందుకువస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో వారంతా తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు.
ఫీజులు చెల్లించనిదే ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదు. అప్పులు చేసి కొందరు కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆ స్థోమత లేనివారు మధ్యలోనే విద్యకు స్వస్తిపలుకుతున్నారు. 2024, 2025లో బీటెక్, బీ ఫార్మసీ తదితర కోర్సులు పూర్తిచేసిన వాళ్లకు ఇప్పటికీ కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చిన తరువాతనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. సర్టిఫికెట్లు అందకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలను పొందలేని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాల నడుమ బలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.