హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో లేకపోవడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు రిజర్వేషన్ సవరణ బిల్లు కంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ ముఖ్యమైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం సభలో ఉండి ప్రవేశపెట్టి చర్చించాల్సిన బిల్లును వదిలేసి ఫ్లైటెక్కి రాష్ట్రం దాటి వెళ్లడాన్ని బట్టి ఈ బిల్లుకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని బీసీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల రెండో రోజు మంత్రి శ్రీధర్‌బాబు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సాగుతున్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సభ నుంచి వెళ్లిపోయారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పొంథువల్ మెరిట్ అవార్డ్-2025’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. అలెప్పీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తరలివెళ్లారు. అక్కడ కేసీ వేణుగోపాల్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్కాలర్షిప్లు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ అసెంబ్లీలో సీఎం లేకుండానే బీసీ బిల్లును పాస్ చేసి సభ వాయిదా వేశారు. రేవంత్‌రెడ్డి కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ముఖం చాటేశారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ హాజరుకాలేదు. ఇప్పుడు బీసీ బిల్లును ప్రవేశపెడితే రేవంత్ సభలో ఉండకుండా కేరళ వెళ్లడంపై బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.