హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తులు, చేతి వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇటీవల ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర కులస్థుల నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న అనంతరం సంబంధిత ఫారాలను కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొంటే సరిపోతుందని వెల్లడించారు. అధికారులకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సూచించారు.