Minister KTR | నిజామాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయన వల్ల రాష్ర్టానికి జరిగిన మేలేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ వరుసగా రెండోరోజూ పర్యటించారు. బుధవారం ఉమ్మడి భిక్కనూర్, దోమకొండ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమైన ఆయన తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్తేజం నింపారు.
కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ముందు తొడకొట్టుడు అంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు. ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి ఇక్కడికొచ్చి పోటీ చేస్తాడట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు అని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఆమె కాళికామాతలా కనిపిస్తున్నదా? అని ప్రశ్నించారు. సుద్దపప్పు అంటూ సంబోధించిన రాహుల్‌గాంధీ ఇప్పుడు తెలివిమంతుడిలా కనిపిస్తున్నాడా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ప్రభుత్వంలో దోమకొండను మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇవ్వగా అదే వేదికపై కేసీఆర్‌కు ఎన్నికల ఖర్చు నిమిత్తం కోనాపూర్ గ్రామస్థులు రూ.50వేల నగదును అందించారు.
కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచీ రాష్ట్రమంతా ఒకటే చర్చ జరుగుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. “కామారెడ్డికి కేసీఆర్ రావడానికి గంప గోవర్ధనే కారణం. ‘అన్నా..కామారెడ్డి రైతుల చిరకాల కోరిక ఒక్కటే. మా పొలాలకు గోదావరి నీళ్లు రావాలె. జల్దీగా నీళ్లు రావాలంటే మీరు రావాలి’ అని గోవర్ధన్ చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా కేసీఆర్ ఒప్పుకున్నారు. కామారెడ్డి లో 9న నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ రోజు భిక్కనూర్, రాజంపేట మండ లాల నుంచి ఇంటికొకరు చొప్పున సభకు తరలి రావాలి.. అదిచూసి అవతలి పార్టీలో నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా మీరంతా రావాలి” అని మంత్రి కేటీఆర్ కోరారు.
జంగంపల్లి నుంచి కామారెడ్డి దాకా కేసీఆర్ భూములు ఏసుకుంటా పోతాడని బీజేపోడు చెబుతున్నాడని, వానికి తలకాయ ఉందా? నెత్తిలో మెదడు ఉందా? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “గంత పెద్ద మనిషి.. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కామారెడ్డి భూముల కోసం వస్తాడా? ఆయన ఎందుకొస్తున్నడు. మీకు తాగునీరు, సాగునీరు ఇచ్చేందుకు, పరిశ్రమలు తెచ్చేందుకు వస్తుండు. మాకేం అవసరం ఉంది మీ భూములతో. చెప్పుకునే దమ్ము లేక బీజేపోడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండు. మోదీ వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నది. బీజేపోడ్ని అడగండి. 70 రూపాయల పెట్రోల్‌ను 110 రూపాయలు చేసిండు. 400 రూపాయలున్న సిలిండర్ ధరను రూ. 1200 చేసింది మోదీ కాదా? చేసుకున్నది చెప్పుకునే దమ్ములేని దద్దమ్మలు వారు. అసైన్డు భూములకు సంపూర్ణ హక్కులను సంబంధీకులకే ఇస్తాం. మీ భూములను గుంజుకునే అవసరం ప్రభుత్వానికి ఏమున్నది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంపన్న చేతిలోనే ఓడిన షబ్బీర్ అలీ.. కేసీఆర్ చేతిలో ఎలా గెలుస్తామని నిజామాబాద్ వెళ్లినట్టు ఉన్నాడని అన్నారు. బీజేపీ వాళ్లు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు.
షబ్బీర్ అలీ గమ్మత్తుగా మాట్లాడుతున్నారని, రోడ్లు ఇట్లెందుకు ఉన్నాయి.. మోర్లు ఇలా ఎందుకున్నాయని అంటున్నారని, కాంగ్రెస్‌కు 11 సార్లు చాన్స్ ఇస్తే ఇయ్యాల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను బిచ్చగాళ్లు అంటున్న రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలని కోరారు. రైతుబంధుతో కేసీఆర్ డబ్బులను దుబారా చేస్తున్నాడని కాంగ్రెసోళ్లు చేస్తున్న ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక మరిన్ని కొత్త పథకాలు వస్తాయని, కాంగ్రెస్, బీజేపీ దొంగలకు అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. ఆయా సమావేశాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, నేతలు ఎల్ నర్సింగరావు, వకీల్ రామారావు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, నల్లవెల్లి అశోక్, గంప శశాంక్ పాల్గొన్నారు.