హైదరాబాద్: ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రాస్తారోకోలు, ధర్నాలు చేయగా నేడు ఏకంగా కానిస్టేబుళ్లు నిరసనబాటపట్టారు. రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లలో కానిస్టేబుళ్లు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ ఇబ్రహీంపట్నంలోని నాగార్జున సాగర్ హైవేపై కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. హోమ్ శాఖ సీఎం రేవంత్ చేతుల్లోనే ఉందని, తమ బ్రతుకులు కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వారిని అక్కడిని తరలించేందుకు యత్నించగా తోపులాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ధర్నా ఒక్కసారిగా ఉధృతంగా మారింది. దీంతో ధర్నా కాస్తా పోలీస్ వర్సెస్ పోలీస్‌గా మారింది. అయితే వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఒకే పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ కల్పించాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి విధి విధానాలను మార్చాలని స్పష్టం చేశారు. ఓకే చోట ఐదేండ్లు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబాలకు కూడా సౌకర్యాలు కల్పించాలన్నారు. బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించాలన్నారు. హోం శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, విధి విధానాలు, జీవనశైలి ఒకే విధంగా ఉండాలని డిమాంచ్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్
పోలీస్ వర్సెస్ పోలీస్
బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ధర్నా, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డితో వాగ్వాదానికి దిగిన పోలీస్ కుటుంబ సభ్యులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, పోలీసులకు స్థానిక మధ్య తోపులాట… pic.twitter.com/wFUgthIF5j
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024