Bathukamma | ములుగు, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను ఆడబిడ్డలు చీకట్లోనే జరుపుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ములుగు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్ మండలం చింతలపల్లిలో చోటుచేసుకున్నది. దాదాపు 40 మంది మహిళలు గ్రామ ప్రధాన కూడలి వద్ద బుధవారం ఎంగిలిపూల బతుకమ్మను చీకట్లోనే ఆడుకోవాల్సి వచ్చింది. 15 రోజులుగా వీధి లైట్లు వెలుగడం లేదని పంచాయతీ కార్యదర్శి కవితకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫలితంగా బతుకమ్మ వేడుకలను మహిళలు మొబైల్ లైట్లు, ద్విచక్రవాహనాల హెడ్లైట్లు, బతుకమ్మలపై వెలిగించిన దీపాల వెలుగులోనే 2 గంటలపాటు ఆడాల్సి వచ్చింది. ఈ గ్రామం నియోజకవర్గ పరంగా మంత్రి సీతక్క పరిధిలో ఉండగా జిల్లాపరంగా జయశంకర్ భూపాలపల్లి పరిధిలోకి వస్తుంది. ఇదిలావుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామంలోనూ మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు ఇవ్వలేదు.. కనీసం బతుకమ్మ ఆడుకునేందుకు లైట్లు కూడా వేయలేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసి ప్రభుత్వానికి చురకలు అంటించారు.