ప్రజల అనుమతి లేకుండా ఇంట్లోకే రాకూడదు.. అలాంటిది ఇల్లునే కూల్చేసే హక్కు మీకెవ్వరిచ్చారు?
– బస్తీల జేఏసీ ప్రశ్న
కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కంపెనీలతో చర్చలు జరపడం కాదు.. ఇక్కడి ప్రజలతో చర్చించండి..ఇక్కడ నివసిస్తున్న ప్రజలతో కలిసి వారి అనుమతితో మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లండి..
– సీఎం రేవంత్‌రెడ్డికి బస్తీల జేఏసీ సూచన
Basti JAC | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 ( నమస్తే తెలంగాణ ) : మూసీ కూల్చివేతల భయంతో ఇన్నిరోజులూ కంటిమీద కునుకు లేకుండా గడిపిన బస్తీలు ఇప్పుడు ‘బస్తీ మే సవాల్’ అంటూ బరిగీసి నిలబడ్డాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా ‘బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటైంది. సుందరీకరణ పేరుతో ఇండ్లు కూల్చితే సహించేది లేదంటూ బస్తీల జేఏసీ హెచ్చరించింది. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యంతో సీఎం రేవంత్‌రెడ్డి తన ఇష్టానుసారంగా నిరుపేదల జీవితాలను కబలించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. మూసీ నిర్వాసితులను కాపాడుకోవడంలో భాగంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ముస్లిం అసోసియేషన్స్ సంయుక్తంగా బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి.
ఈ మేరకు వాళ్లంతా సోషల్ మీడియాలో ‘మూసీ జన్ ఆందోళన్’ పేరిట పోస్టర్లను పోస్ట్ చేశారు. ఇప్పుడివి విస్త్రృతంగా వైరల్ అవుతున్నాయి. బఫర్ జోన్లో నివసిస్తున్న ప్రజలు ఎక్కడికీ కదలరని స్పష్టం చేసింది. మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ఇండ్లకు మార్కెట్ విలువను కట్టి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, నగరంలో సమానమైన స్థలాన్ని కేటాయించాలని, మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో నివసిస్తున్న కిరాయిదారులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మూసీ నివాసాలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రచించుకోవాలని తెలిపారు. మూసీ నదిపై ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే ముందుగా నదిలో పూడిక తీసి ఇందులో పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చూడాలని హితవు పలికారు.