హైదరాబాద్ : ఆస్పత్రిని స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basava Tharakam cancer hospital) లో 25వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి (Health minister) దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha), రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma), ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మేనేజ్మెంట్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో మరణించిన ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆస్పత్రి.. ఇప్పటివరకు లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించిందని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ ఐకానిక్ లీడరని, లెజెండరీ యాక్టరని మంత్రి కొనియాడారు. సినిమా, సామాజిక సేవల్లో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తి అని మంత్రి దామోదర అన్నారు. నాటి ఆయన విజనే నేటి ఈ హాస్పిటల్ అని వ్యాఖ్యానించారు. ఈ ఆస్పత్రి లక్షలాది మంది పేద రోగులకు జీవితంపై ఆశ, నమ్మకం కలిగిస్తోందని మెచ్చుకున్నారు. క్యాన్సర్ సమస్య దేశవ్యాప్తంగా పెరుగుతోందని, తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో అందిస్తామని అన్నారు.