Rythy Runa Mafi | ధర్పల్లి, డిసెంబర్ 17 : రేవంత్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు వడ్ల డబ్బులను పంట రుణం కింద కొట్టేశారు. దీంతో రైతులు అటు రుణమాఫీ కాక, ఇటు వడ్ల డబ్బులు చేతికందక లబోదిబోమంటున్నారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చల్లగరిగెకు చెందిన రైతు దంపతులు ఎం రాజేశ్వర్, గంగాజమునకు ధర్పల్లిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది. గంగాజమున రూ.75 వేల పంట రుణం తీసుకోగా రుణ మాఫీ అవుతుందని డబ్బులు చెల్లించలేదు. ఇటీవల వడ్లు విక్రయించగా, ఈ నెల 5న రాజేశ్వర్, గంగాజమున జాయింట్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. బ్యాంకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పంట రుణం కింద ఈ నెల 11న ఖాతా నుంచి రూ.1,06,265 కట్ చేసుకున్నారు.
గంగాజమున డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా, ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండటం చూసి లబోదిబోమన్నారు. దీనిపై ఆరా తీయగా, క్రాప్‌లోన్ మొండి బకాయి కావడంతో ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయినట్టు బ్యాంక్ మేనేజర్ చెప్పారు. కనీసం చెప్పకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా, అసహనానికి గురైన బ్యాంక్ అధికారులు తాము చేసేదేమీ లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని దబాయించినట్టు బాధితులు ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు.