బిచ్కుంద, అక్టోబర్ 25: బ్యాంకు రుణం కట్టలేదని రైతు భూమిని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న 7.10 ఎకరాల భూమిని 2016లో జుక్కల్లోని నిజామాబాద్ కేంద్ర సహకార బ్యాంక్ (ఎన్డీసీసీబీ)లో తనఖా పెట్టి రూ.6 లక్షల రుణం తీసుకున్నాడు. రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం ఆ రుణం అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.14 లక్షలకు చేరింది. లోన్ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు పంపించారు. స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు గురువారం రైతు పొలం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ భూమిని విక్రయానికి పెట్టిన బ్యాంక్ ఉన్నతాధికారులు.. నాగల్గావ్లో వేలం పాట నిర్వహించారు. ఇద్దరు రైతులు మాత్రమే వేలంలో పాల్గొన్నారు. రుణం మొత్తం రూ.14 లక్షలు ఉన్నందున మొత్తం భూమిని కాకుండా ఎకరం మాత్రమే విక్రయిస్తామని బ్యాంకర్లు చెప్పడంతో సదరు రైతులు వెనుదిరిగారు. దీంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది.
18 శాతం తేమ ఉన్నా పత్తిని కొనాలి
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు 18 శాతం వరకు తేమ ఉన్నా.. మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొ మ్మినివేని రవీందర్రెడ్డి శుక్రవారం కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్సింగ్కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తిచేశారు.