రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిచేశామని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్‌తోనూ ఇదే విషయాన్ని చెప్పించింది. కానీ తనకు ఏ మాఫీ కాలేదని, తీసుకున్న అప్పు కోసం బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నాడు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన రైతు యాకన్న. పొలం ముందు నిలబడి తనకు వచ్చిన అప్పు నోటీసును చూపుతున్నాడు. రుణమాఫీలో ఏది నిజం? ఏది అబద్ధం?
Runa Mafi | నర్సింహులపేట, మార్చి 13 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఓ దళిత రైతులపై బ్యాంకు అధికారులు చేసిన దౌర్జన్యం వెలుగుచూసింది. తాను అర్హుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో సదరు రైతు అప్పు తెచ్చి బ్యాంకు రుణం చెల్లించాల్సి వచ్చింది. కాంగ్రెస్ సర్కారులో దళిత రైతులకు జరుగుతున్న అన్యాయానికి ఈ ఘటనే సాక్ష్యంగా నిలిచింది.
సాగునీళ్లు లేక ఓవైపు పంటలు ఎండిపోతున్నాయి.. మరోవైపు పెట్టుబడి కోసం చేసిన అప్పులు మాఫీకాక, రైతుభరోసా అందక మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన తిప్పలు పడుతున్న రైతులకు డీసీసీ బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చి మరింత ఆగం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల మార్జిగేజ్పై తీసుకున్న రుణాల చెల్లింపులు ఆలస్యమయ్యాయంటూ బ్యాంకు అధికారులు 20 మంది రైతులకు నోటీసులిచ్చారు. రుణాలు చెల్లించకపోతే జెండాలు పాతి భూములు వేలం వేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూముల్లో జెండాలు పాతితే పరువు పోతుందని వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి బ్యాంకు అధికారులకు చెల్లించామని కొందరు రైతులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షలలోపే బ్యాంకు అప్పులున్నా తమకు రుణమాఫీ కాలేదని, బ్యాంకు వాళ్లు మాత్రం ముక్కుపిండి తమ నుంచి రుణాలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్హత గల రైతులకు ఇచ్చే పైసలకే దికులేదుగాని, తాము కట్టాల్సిన బకాయిలకు మాత్రం నోటీసులు పంపించి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ నుంచి 2019లో రూ.90 వేల పంట రుణం తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నాటికి వడ్డీతో సహా మొత్తం రూ. 1.25 లక్షలు అయ్యింది. అయినా నాకు రుణమాఫీ కాలేదు. నా లోన్ అకౌంట్ నంబర్‌కు మరొక రైతు ఆధార్ నంబరు నమోదు చేయడం వల్ల రుణమాఫీ కాలేదని పీఏసీఎస్, వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. పలుమార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా రుణమాఫీ కాలేదు.
2020లో మరిపెడ డీసీసీబీలో రూ.5 లక్షల మార్ట్గేజ్ లోన్ తీసుకున్నా. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 2023-24 ఏడాదికి రూ.2 లక్షలు కట్టాను. మళ్లీ ఇప్పుడు రూ.5,71,294 చెల్లించాలని డీసీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. పైసలు కట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తామని బెదిరిస్తున్నారు. సాగు భూమిని ఎకడ వేలం వేస్తారోనని కుమిలిపోతున్నా. పదిమందిలో పరువు పోతుందనే భయంతో రూ.3లక్షల అప్పు తెచ్చి కట్టిన. ప్రభుత్వమేమో రూ.2లక్షల రుణమాఫీ 100 శాతం పూర్తయిందని ప్రకటించింది. నాకెందుకు మాఫీ కాలేదు.
– మందుల యాకన్న, రైతు, జయపురం