జగదేవపూర్,మే 2 : ప్రభుత్వం నుంచి రైతులు, పింఛన్‌దారులకు వచ్చే పెన్షన్, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఖాతాలను బకాయిల పేరుతో హోల్డ్‌లో పెడుతున్నారు. తమ ఖాతాల్లో డబ్బు ఉన్నట్లు కనిపిస్తున్నా, అధికారులు తమ ఖాతాలను హోల్డ్ చేయడంతో డబ్బులు తీసుకోలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని పలు బ్యాంకు అధికారుల తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లబ్ధ్దిదారుల ఖాతాల్లో రైతుభరోసా, పింఛన్ డబ్బులు జమ చేసినప్పటికీ , పంట రుణాల పేరుతో వారి ఖాతాలను హోల్డ్ చేశారు. తమ డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉన్నా ఎందుకు డ్రా చేసుకోలేకపోతున్నామో తెలియక బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగదేవపూర్ మండలం మునిగడపకు చెందిన మామిండ్ల బాల్‌నర్సయ్యకు ఇటీవల ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. వాటిని డ్రా చేసుకుందామని చూస్తే బ్యాంకు ఖాతా హోల్డ్‌లో పెట్టారని తెలిసింది. జగదేవపూర్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్లి అధికారులను అడగగా, క్రాప్‌లోన్ ఉంది కాబట్టి, దానిని రెన్యువల్ చేస్తేనే ఖాతా హోల్డ్ లోంచి తీస్త్తామని చెప్పడంతో రైతు అవాక్కయ్యాడు. తనకు రూ.70 వేల రుణం ఉందని, తన ఖాతాలో అరకొరగా ఉన్న డబ్బులు ఆపితే పంట రుణం తీరుతుందా అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కోత దశలో ఉందని, పంట అమ్మి డబ్బులు చెల్లిస్తామని చెప్పినా వినడంలేదని వాపోయాడు. అదే గ్రామానికి చెందిన ముచ్చపతి అంజయ్య తన వృద్ధ్దాప్య పింఛన్ డబ్బులు ఖాతాలో జమ అవుతున్నా.. ఆరు నెలలుగా పింఛన్ డబ్బులు తీసుకోలే పోతున్నానని తెలిపాడు. పంట పెట్టుబడుల కోసం తిరిగి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.