హైదరాబాద్, మార్చి 25 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో బంజారాలకు అవకాశం కల్పించాలని బంజారా సంఘం, బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బంజారాసంఘం, బంజారా ఉద్యోగుల నేతలు కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు.
బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్‌నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 10 శాతం లంబాడీ గిరిజనులు ఉన్నారని, ఒక శాతం కూడా లేని ఆదివాసీ గిరిజనుల్లోని ఇతర కులాలవారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించి, 10శాతం ఉన్న బంజారాలను విస్మరించడం తగదని హితవు పలికారు.
రాష్ట్రంలో 38 లక్షల మంది బంజారాలు ఉన్నారని, వారి ప్రాతినిథ్యం కోసం అధికార పార్టీలో ఉన్న సీనియర్లకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచందర్‌నాయక్, సీనియర్ ఎమ్మెల్యే నెహ్రూ నాయక్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌లలో ఒకరికి మంత్రివర్గ కూర్పులో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.