హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): వీరులకు కాణాచి రా తెలంగాణ.. ధీరులకు మొగసాలరా.. అని ఆత్మగౌరవ పతాకను ఆకాశాన ఎగురేసిన నేల మనది. ఇవాళ ఈ ఆత్మగౌరవం ఢిల్లీలోని గుజరాతీ నేతలకు గులాముల వల్ల మంటగలిసింది. ఏ అస్తిత్వం కోసం ఆరున్నర దశాబ్దాల పాటు మనం పోరాడామో.. ఏ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం వందలకొద్దీ బలిదానాలు జరిగాయో.. ఒకే ఒక్క తొత్తు వల్ల ఆ పతాక నేలకూలింది. ఆ ఆత్మగౌరవం గుజరాత్ బాసులకు పాదాక్రాంతమైంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. తన స్వామిభక్తిని అమితంగా ప్రదర్శించడం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా చెప్పులను మోయడం.. తెలంగాణ సమాజం ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నది. దేశ అత్యున్నత శాసన వ్యవస్థ అయిన పార్లమెంట్లో తనతో సమానమైన ఎంపీ, పార్టీ రాష్ట్ర శాఖకు స్వయంగా అధ్యక్షుడు.. అన్నింటినీ వదిలిపెట్టి.. తన బాస్ చెప్పులు విడిస్తే తీసి పక్కన భద్రపరచడం.. మళ్లీ తెచ్చి కాళ్లకు తొడగడం కంటే హేయమైన పని ఇంకేముంటుంది? ఇది యావత్ తెలంగాణ సమాజానికే అత్యంత అవమానకరమైన చర్య.. అంటూ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇప్పుడు చెప్పండ్రా బత్తాలిబన్లు
ఎవడు బానిస pic.twitter.com/bvNz96fo9o— Journalist Shankar (@shankar_journo) August 22, 2022
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయం బయట అమిత్షా కు బండి సంజయ్ తన చేతులతో చెప్పులు తెచ్చి మరీ తొడిగారు. ఈ ఘటన మొత్తం రాష్ర్టాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. శాసన వ్యవస్థలో.. రాజకీయ వ్యవస్థలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు.. తన స్థాయికి ఉన్న గౌరవ ప్రతిష్ఠలను కూడా మరచిపోయి.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా మరిచిపోయి అన్ని విధాలుగా దిగజారి ప్రవర్తించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మోదీ, అమిత్షా మొదట్నుంచీ అవకాశం వచ్చిన ప్రతిసారీ తెలంగాణను అవమానిస్తూనే ఉన్నారు.
నాయకుల చెప్పులుమోసే( BJP))నాయకులు మీరా మమ్మల్ని విమర్శించేది “తూ మీబొగిశారా ” narayana cpi pic.twitter.com/9hKR1q2krm
— Narayana Kankanala (@NarayanaKankana) August 22, 2022
ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటునే అవమానించారు. వడ్లు కొనాలని వెళ్లిన రాష్ట్ర మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీ జనానికి నూకలు తినడం నేర్పించమని వెటకారం చేశారు. ఇక అమిత్షా సంగతి సరేసరి.. బీజేపీ అంటేనే పెద్దోళ్ల పార్టీ, సిరిమంతుల పార్టీ అనే ముద్ర మొదటి నుంచి ఉన్నదే. ఆ పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సహచర ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి చేత చెప్పులను మోయించుకోవడం దారుణమని.. కనీసం పార్టీ నాయకత్వం దీనిపై స్పందించకపోవడం అన్యాయమని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.