శేరిలింగంపల్లి, మే 11: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ డిమాండ్ చేశారు. పోక్సో కేసు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభు త్వం, పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు సైబరాబాద్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత తుల ఉమ మాట్లాడుతూ తన బిడ్డకు న్యాయం చేయాలని మైనర్ కుటుంబం ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితురాలు ఒక మైనర్ అని, ఆమెకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి, తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని కోరారు. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదని, మైనర్‌కు అన్యాయం జరిగితే పోలీసులు మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మమత, రాగం జంగయ్యయాదవ్, దారుగుపల్లి నరేశ్, రమేశ్‌గౌడ్, నరేశ్‌సింగ్, అజయ్‌గౌడ్, మాధవి, సుగుణ పాల్గొన్నారు.
కఠిన సెక్షన్లు పెట్టాలి
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లను నమోదు చేయాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమిషన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కేసులో బండి సంజయ్‌కు అనుకూలంగా కేసును పోలీసులు నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, సెక్షన్లు తగ్గించి కేసు నమోదు చేశారని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోక్సో నిబంధనలను అమలు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని, కమిషన్‌ను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ జ డ్పీటీసీ సుమిత్రా ఆనంద్ పాల్గొన్నారు.
భగీరథ్ కేసుపై బాలల కమిషన్ సీరియస్ సుమోటోగా స్వీకరించిన కమిషన్
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన క్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
మీ కొడుకునైనా కాపాడొద్దు ; సామాజిక కార్యకర్త సునీతాకృష్ణన్
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): మీ కొడుకు లైంగిక దాడులు చేస్తే తల్లిదండ్రుల బాధ్యత పేరిట అతడిని కాపాడొద్దని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘ సేవకురాలు సునీతాకృష్ణన్ హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆమె ‘ఎక్స్’ వేదికగా బండి సంజయ్ కొడుకు కేసును పరోక్షంగా ఉదహరిస్తూ ట్వీట్ చేశారు. అలాంటి పనులు చేస్తే శిక్ష తప్పదని తెలిసేలా చేయాలని కోరారు. ఇదే సమాజానికి మీరు చేసే గొప్ప సేవ అంటూ పేర్కొన్నారు.
చట్టప్రకారం శిక్షించాలి: వంటేరు
గజ్వేల్, మే 11: మైనర్ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకును చట్టప్రకారం శిక్షించాలని, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.