హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 అక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశానికి బుధవారం లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన పలు సందేహాలను ఆ లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు. వారం రోజుల్లో సమగ్ర సమాచారాన్ని అందజేయాలని కోరారు. మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. మరో వైపు హైకోర్టులో గ్రూప్-1 కేసు విచారణ కొనసాగుతుండటంతో టీజీపీఎస్సీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం ఇంప్లీడ్ కావాలని బండి సంజయ్ నిర్ణయించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అవినీతి, అక్రమాలు, తప్పిదాలకు తావు లేకుండా మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు జరిగేలా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు.