హైదరాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. చెక్‌డ్యాం కూలిపోయేందుకు కారణమైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు నష్టపోయిన ప్రజాధనాన్ని రాబట్టేందుకు వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఇసుక అక్రమ దందా చేస్తూ దోపిడీని దర్జాగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నీటి పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల సమీప రైతుల సారవంతమైన నేలలు నిస్సారంగా మారి నష్టం జరుగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.