హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం రైల్వేలో రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తుంటే రాష్ర్టానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నట్టు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ‘బండి సంజయ్.. గాంధీ ఘాట్ వద్ద కాదు, రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో నిరసన చేపట్టు’ అని డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు, కొత్త రైల్వే లైన్లు లేవని తెలిపారు. కేవలం పూర్వపు లైన్ల ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్‌కు తప్ప కొత్తగా నిధుల కేటాయింపులు ఏమీ లేవని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట వ్యాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ ( పీవోహెచ్)కు నామమాత్రంగా రూ.45 కోట్లు మాత్ర మే కేటాయించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వందేండ్ల కిందటి రైల్వే లైన్లను ట్రిప్లింగ్ చేసేందుకు మాత్రమే నిధులు కేటాయించారని వెల్లడించారు.
కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలపై పట్టింపేది?
రాష్ర్టానికి చెందిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఆరు కొత్త లైన్ల ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయని తెలిపారు. తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న వివక్షపూరిత విధానాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు.