హైదరాబాద్, జులై 17(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు రెండు రాష్ర్టాలు ముఖ్యమని, వాటి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. రెండు రాష్ర్టాల సీఎంలను కూర్చోబెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలి విజయం సాధించిందని తెలిపారు.
జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేసిందని, తద్వారా ఒక మంచి అడుగు పడిందని పేర్కొన్నారు. రెండు రాష్ర్టాలకు అన్యాయం జరగకుండా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగింది ఇదేనని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏవేవో మాట్లాడుతూ ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయని బండి అన్నారు.