భీమదేవరపల్లి, జనవరి 13: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కోరిన కోరికలు తీర్చాలని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతితో ముడిపడి ఉన్న సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కోర మీసాల వీరభద్రుడు కాబట్టే సమాజాన్ని నాశనం చేయాలనుకునేవాళ్ల భరతం పడతాడని పేర్కొన్నారు. చెడు ఆలోచనలు ఉన్న వాళ్లలో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రుడు అని గుర్తు చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆయనతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఆలయ ఈవో కిషన్ రావు, డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు.