హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీని రైతులు అడ్డుకోగా ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ బీజేపీ నానా యాగీ చేసింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీయే అదంతా చేసిందని ఆధారాలతో సహా అనేక మీడియా సంస్థలు, నెటిజన్లు బయటపెట్టారు. అయినా బీజేపీ గోబెల్స్ ప్రచారం కొనసాగించింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు కొందరు వ్యక్తులు పన్నిన కుట్రను ముందుగానే పసిగట్టిన తెలంగాణ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కుట్రను నిర్ధారించే ఆయుధాలు, ఇతర ఆధారాలను మీడియా ముందుంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఇదో ‘డ్రామా’, ‘సినిమా’ అంటూ చిల్లర కామెంట్లు చేశారు. పోలీసులు తీగ లాగడంతో కొందరు నేతల్లో వణుకు మొదలైంది. హత్యా రాజకీయాలను బీజేపీ ఎన్నటికీ సమర్థ్ధించదని బండి సంజయ్ చెప్తున్న మాటలు నిజమైతే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్నది తెలంగాణ ప్రజల ప్రశ్న. మంత్రి హత్యకు పన్నిన కుట్రను భైంసా ఘటనతో ముడిపెట్టడంపైనా బండి సంజయ్‌పై విశ్లేషకులు మండిపడుతున్నారు. భైంసా ఘటనలో విషయం తెలిసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిందని, పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి, అరెస్ట్ చేశారని, అతడిని పదవి నుంచి తొలిగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారని గుర్తు చేస్తున్నారు. మంత్రి హత్యకు కుట్ర పన్నినవారిని వెంటనే అరెస్ట్ చేయకుండా.. వారం పది రోజులు ఆగి, నేరం జరిగిన తర్వాత నింపాదిగా అదుపులోకి తీసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.