హైదరాబాద్, ఫిబ్రవరి 9 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తన ‘తెలివి’ని ప్రదర్శించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన విద్వేష వ్యాఖ్యలను కప్పిపుచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నంలో మరోసారి ఆగమాగమయ్యారు. మోదీ వ్యాఖ్యలకు తానే స్వయంగా కౌంటర్ ఇచ్చారు. ఓవైపు చర్చ జరుగాల్సి ఉండె.. అంటూనే సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే విభజన బిల్లు పెట్టారని వ్యాఖ్యానించారు.
మోదీ మాట: ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ర్టాన్ని అవమానకరంగా విభజించారు.
బండి కౌంటర్: తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాకే బిల్లు పాస్ అయ్యింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అంటూ బీజేపీ కాకినాడ తీర్మానం చేసింది. అప్పుడు ఏన్డీఏలో ఉన్న చంద్రబాబు వల్ల రాష్ట్ర విభజన చేయలేకపోయాం.
సామాన్యుడి తూటా: సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అంశంపై లోతుగా చర్చించిన తర్వాతే విధాన ప్రకటన చేస్తాయి. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయంటేనే.. పార్టీలన్నీ లోతుగా విశ్లేషించాయని అర్థం. బీజేపీ కాకినాడ తీర్మానంతోనే రాష్ట్ర ఏర్పాటు అవసరమని గుర్తించింది. అప్పటి నుంచి 2014 వరకు 14 ఏండ్లపాటు మంతనాలు జరిగాయనే కదా అర్థం. మోదీ ఉద్దేశంలో ఇంకా ఎన్నేండ్లపాటు చర్చలు జరిగితే బాగుండేది?
మోదీ మాట: బిల్లును హడావుడిగా ఆమోదించారు.
బండి కౌంటర్: తెలంగాణలో బలిదానాలు ఆగిపోవాలంటే బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ వెంటనే ఆమోదం పొందాల్సిందేనని బీజేపీ తరఫున దివంగత సుష్మాస్వరాజ్ పోరాడారు. పెప్పర్ స్ప్రే కొట్టినా బయటికి వెళ్లకుండా అక్కడే నిలబడ్డారు.
సామాన్యుడి తూటా: మలి దశ ఉద్యమంలో జరిగిన బలిదానాలకు కాంగ్రెస్, బీజేపీది సమాన బాధ్యత. 2009 ప్రకటన తర్వాత యువత బలిదానాలు చేసుకొంటుంటే దేశం కన్నీరు కార్చింది. అవి ఇంకా కొనసాగకూడదనే రాజకీయ పార్టీలన్నీ బిల్లుకు వేగంగా ఆమోదం తెలిపాయన్నది వాస్తవం. మోదీ ఉద్దేశంలో ఇంకా ఎంత కాలం పొడిగించాల్సి ఉండే.. ఎన్ని బలిదానాలు జరుగాల్సి ఉండే?
వీళ్లేం తక్కువ తినలేదు..
రాష్ట్రంపై విషం కక్కడంతో మోదీకి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఏమాత్రం తీసిపోలేదు. తెలంగాణ బిల్లుపై ‘ఇంకా చర్చ జరిగే అవకాశమున్నది. చర్చ జరిపే అవకాశమున్నది. అయినా కాంగ్రెస్ ఆ పని చేయలేదు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం మోదీ చేసిన కామెంట్లలో ఒక్క అక్షరం కూడా తప్పు లేదన్నారు. పైగా రాష్ట్ర విభజన ‘ఆగమాగం.. జగన్నాథం అయ్యింది. పద్ధతి ప్రకారంగా చర్చించలేదు’ అంటూ పరోక్షంగా తెలంగాణను అవమానించారు.