కరీంనగర్ విద్యానగర్ ఆగస్టు 19: రుణమాఫీపై(Loan waiver) కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. కరీంనగర్లోని తన నివాసం వద్ద ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతన లేదని, సోనియాగాంధీ పుట్టిన రోజు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కొందరికే మాఫీ చేశారని ఆరోపించారు.
రూ.40వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి సోనియా గాంధీనే మోసం చేసిన ఘనులు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. రైతు భరోసా, విద్యా భరోసా, మహాలక్ష్మి వంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రజల గురించి పట్టించుకో వడం మానేసిందని, పాలనను గాలికి వదిలేసిందన్నారు. అడిగితే తప్ప స్పందించడం లేదని, కరీంనగర్ జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా వెంటనే రివ్యూ పెట్టి సమస్యను పరిష్కరించాలన్నారు.