హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ) : అమెరికా ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించడం గొప్ప ప్రగతి అని రాజ్యసభ్యుడు డాక్టర్ పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. ఈ మినహాయింపు వల్ల దేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు భారీ ఊరట లభిస్తుందని, దేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి, చర్చలు జరిపి, సత్ఫలితాలు రాబట్టడం పట్ల కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి గురువారం లేఖ రాశారు. ‘పార్లమెంట్ సభ్యుడిగా, ఫార్మా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఈ మినహాయింపు భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు, దేశానికి ఎంతో ప్రయోజనాలు తెచ్చిపెడుతుందని నాకు అర్థమవుతున్నది.
ఇది మన ఎగుమతులను పెంచడమేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఫార్మా ఉత్పత్తులకు మంచి ఎగుమతిదారుగా భారతదేశం స్థితిని మరింత బలపరుస్తుంది. ప్రపంచ ఔషధశాల అనే పేరును కాపాడుకునేందుకు దోహదం చేస్తుంది. ఈ అచీవ్మెంట్కు మరోసారి కృతజ్ఞతలు’ అని లేఖలో ఎంపీ పేర్కొన్నారు. అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించబోయే ప్రతీకార సుంకాల వల్ల భారత ఫార్మారంగం ఎదురోబోయే పెనుసవాళ్లను ఒక శాస్త్రవేత్తగా, ఫార్మారంగానికి చెందిన పారిశ్రామికవేత్తగా మార్చి 26న రాజ్యసభలో పార్థసారథిరెడ్డి ప్రస్తావించారు. పొంచి ఉన్న పెనువిపత్తు నుంచి భారత ఫార్మారంగాన్ని, ఫార్మా ఎగుమతులను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. తగు నివారణోపాయాలను కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.