హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. మంగళవారం సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేదర్ విగ్రహం దగ్గర కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఈటీ నరసింహ మాట్లాడుతూ బండి భగీరథ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నదని చెప్పారు. పోక్సో కేసులో 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసిన చరిత్ర రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఉన్నదని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రేప్ కేసుల్లో ఇరుకొని శిక్షలు అనుభవిస్తున్నారని తెలిపారు.
కేంద్రమంత్రిగా ఉన్న బండిసంజయ్ తనపై కుట్ర జరుగుతున్నదని, తాను బీసీ నాయకుడిగా కష్టపడి ఎదిగానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. బండి సంజయ్ కొడుకు అనేక కేసుల్లో ఇరుకున్నాడని.. కొడుకుకు బుద్ధి చెప్పాల్సింది పోయి వెనుకేసుకొని రావటం మూలంగానే ప్రస్తుతం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడం జరిగిందని వివరించారు. భగీరథ్‌ను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ప్రేమ్‌పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.