నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 11: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ్ సంజయ్ కొడుకు బండి సాయిభగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సంగారెడ్డిలో కొత్త బస్‌స్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్వీ నాయకులు ప్లకార్డులతో బైఠాయించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వరంగల్ కమిషనరేట్‌ను ముట్టడించారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు రాయుడు సీతా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. సిరికొండ, బోథ్ పోలీస్ స్టేషన్లలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలుతీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
పోక్సో కేసు నమోదై మూడు రోజులైనా బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విలాస్ గాదేవార్ , కిరణ్ కొమ్రేవార్ పేర్కొన్నారు. భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో జిల్లా నాయకుడు దావ సురేశ్‌తోపాటు నాయకులు ధర్నా చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని పోస్టర్లను ఐలాండ్‌కు అటించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకొని పోస్టర్లను చింపివేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, మహిళా కౌన్సిలర్లు ఎస్పీ మహేశ్ బీ గీతేకు ఫిర్యాదుచేశారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వరంలో ప్ల్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లిలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టి పోలీసులకు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కండ్లకు నల్ల బట్టలను కట్టుకుని నిరసన తెలిపారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాలు పలు సంఘాలు ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నా చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించి బండి సంజయ్, ఆయన కుమారుడు బండి భగీరథ్ చిత్రపటాలను దహనం చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను వెంటనే మంత్రి వర్గంనుండి బర్తరఫ్‌చేసి, అతని కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. చిట్యాల భువనగిరి రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఖమ్మంలో కేంద్రమంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి: ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
చిక్కడపల్లి, మే11: బాలికపై వేధింపుల విషయంలో పోక్సో కేసు నమోదైన బండి సాయిభగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, కేంద్రమంత్రి బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని, బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాంనగర్ చౌరస్తాలో నిరసన చేపట్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీఆర్ఎస్ యువనాయకుడు ముఠా జయసింహ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఉద్యమిస్తామని చెప్పారు. పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే వేదికను పంచుకోవడం ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

యాదాద్రి జిల్లా రామన్నపేటలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాయకులు

సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు