హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ‘త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి. ఇతర పార్టీల నేతలు అనేకమంది టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కమలానికి తిరుగులేదు’ అంటూ ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. పైకి చెపుతున్నది ఒకటి.. లోపల జరుగుతున్నది మరొకలా ఉన్నది ఆ పార్టీ పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరు ణ్ చుగ్ చెపుతున్న ‘చేరిక’ల మాటలను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు. మొదట్లో ఒకరిద్దరు చేరినా.. కొద్ది రోజులకే అక్కడి పరిస్థితులు అర్థమైపోయాయి.
ఈటల.. మాటలు నమ్మలేం
బీఆర్ఎస్ ముఖ్యనేతలందరినీ తీసుకొస్తాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీని అప్పగించారు. ‘పార్టీలో ఆయనకే పెద్దగా విలువ లేదు. ఆయన్ను నమ్మి మనమెలా వెళ్తాం’ అని చాలా మంది చర్చించుకొన్నారు. మునుగోడు ఉపఎన్నికతో ఆ పార్టీ బలం అర్థమైంది. ప్రచారమే తప్ప బలం లేదని రుజువు కావడంతో కన్నెత్తి చూసే వారు కరువయ్యారు. శుక్రవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ‘ఇటీవల కొన్ని విభేదాలతో కొందరు బీజేపీని వదిలి వెళ్లారు. తిరిగి రండి. అందరం కలిసి పనిచేద్దాం’ అని విజ్ఞప్తి చేయడం ఆ పార్టీ బేలతనానికి నిదర్శనమని చెప్పొచ్చు. బండి పిలుపును బట్టి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెపుతున్నారు.